ముంబై: మహారాష్ట్ర రాజకీయాలను కనుసైగలతో శాసించిన మహా నాయకుడు బాలాసాహెబ్ ఠాక్రే. ఆయన నేతృత్వంలో పురుడుపోసుకున్న శివసేన పార్టీని మరాఠాలు ఆత్మబంధువుగా భావిస్తారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చిప్పటి నుంచి కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మరాఠా గడ్డపై 19 జూన్1966న శివసేన పార్టీని బాల్ ఠాక్రే స్థాపించారు. కరుడుగట్టిన హిందుత్వ వాదిగా పేరు మోసిన ఠాక్రే.. హిందుత్వ ఎజెండాను బుజానకెత్తుకుని పార్టీ సిద్ధాంతాలను మరాఠాల మెదళ్లకు ఎక్కించడంలో అద్భుతమైన విజయం సాధించారు. ఆయన కుమారుడే ఉద్ధవ్ ఠాక్రే. పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే బలమైన శక్తిగా శివసేన అవతరించింది. అయితే సేన ఎదుగుదల వెనుక బాలాసాహెబ్ బలమైన పునాదులే కారణమంటూ పలువురు మరాఠా నాయకులు అభిప్రాయపడుతుంటారు. ఆవిర్భవం నుంచి మరాఠా రిజర్వేషన్లు, ఐక్యత కోసం పోరాడుతూ ఒక్కోమెట్టు ఎదుగుతూ వచ్చింది శివసేన. కాంగ్రెస్‌ను కట్టడి చేయాలంటే భావసారూప్యత గల బీజేపీతో జట్టు కట్టి ఐక్యంగా సాగాలని బాల్‌ఠాక్రే భావించారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయీ హయాంలో ఎన్డీయే ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించారు. తమ పోరాటం కేవలం హిందుమత వ్యాప్తి, మరాఠాల రిజర్వేషన్ల కోసమే అని బహిరంగంగా ప్రకటించిన బాల్‌సాహెబ్.. ఠాక్రే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవ్వరూ ఎలాంటి ఉన్నత పదవులను చేపట్టరంటూ సంచలన ప్రకటన చేశారు.
మహా సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం