సొంతగడ్డపై తమకు ఎదురేలేదని భారత్ మరోసారి నిరూపించింది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (330 బంతుల్లో 243; 28 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్వితీయ ద్విశతకంతో రాణించడం, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(3/27, 4/31) బుల్లెట్ లాంటి బంతులతో విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 213 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో కోహ్లీసేన ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్‌కిది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు 1-0తో ఆధిక్యం లభించింది. అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా బంగ్లాను చిత్తుచిత్తుగా ఓడించింది. ప్రత్యర్థి ఆటగాళ్లు ఏ విభాగంలోనూ స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకోలేకపోయారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు.
తొలి టెస్టులో భారత్ గెలుపు
భారత బౌలర్లలో అశ్విన్(3/42), ఉమేశ్ యాదవ్(2/52), ఇషాంత్ శర్మ(1/31) బంగ్లాను కుప్పకూల్చారు. భారీ లక్ష్య ఛేదనలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ ఒక్కడే అర్ధశతకంతో ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. అతడు ఔటవగానే బంగ్లా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఇస్లాం(6), ఇమ్రుల్ కైస్(6), మొమినుల్ హక్(7) కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత పేసర్లు మెరుపు దాడితో తలో వికెట్ పడగొట్టడంతో 37కే 3 వికెట్లు చేజార్చుకున్న కష్టాల్లో పడింది. ఆ తర్వాత రహీమ్ కాసేపు ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్ దాస్(35), మెహిదీ హసన్(38) పర్వాలేదనిపించారు.